Phone Tapping Case: కేసీఆర్‌కు సిట్ నోటీసులు, విచారణకు పిలుపు

swarupa
రచయిత:

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం చివరి అంకానికి చేరిందా? ఈ కేసుకు వేగంగా ముగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోందా? కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందా? ఈ వ్యవహారంపై రెండురోజులుగా సిట్ అధికారులు చర్చించారా? నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారించనుంది సిట్. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో ప్రస్తావించారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫిర్యాదుపై మాజీ సీఎంని విచారణ చేయనుంది.

ఇప్పటికే హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులను సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకానికి చేరింది. ఈ కేసులో తొలుత అధికారులను విచారించింది సిట్. ఆ తర్వాత రాజకీయ నేతల వంతైంది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీని విచారించారు. కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధా కిషన్‌రావు వెల్లడించారు.

నోటీసుల వివరాలు
రాధా కిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పెద్దాయన అంటూ ప్రస్తావించారు పోలీసులు. ప్రస్తుతం ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో ఉన్నారు మాజీ సీఎం. సిట్ టీమ్ నందినగర్‌లో కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని ప్రస్తావించారు. మీరు స్టేషన్‌కు వచ్చినా సరేనని, లేదంటే మీరు చెప్పిన ప్రదేశంలో విచారిస్తామని పేర్కొన్నారు. సీఆర్ పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు.

నోటీసులు అందుకున్న తర్వాత లీగల్ టీమ్‌తో కేసీఆర్ చర్చించనున్నారు. కేసీఆర్‌ని స్టేషన్‌లో విచారిస్తారా? లేకుంటే ఫామ్ హౌస్‌లో విచారిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి రాజకీయ నేతలు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఏ అడుగు వేయాలన్నా… దాని వల్ల పార్టీకి ఎంత మేర మైలేజీ వస్తుందన్నదే ముందుగా లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు స్టేషన్‌కు వెళ్లడంపైనా అదే కోణంలో ఆలోచన సాగుతోంది. అక్కడికి వెళ్లితే పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందన్న భావన కొందరు నేతల్లో బలంగా ఉంది.

స్టేషన్‌ పరిసరాల్లో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తే, దాని ద్వారా ప్రజల్లో చర్చ మొదలవుతుందని, మీడియా దృష్టి పడుతుందని అంచనా వేస్తున్నారు. కార్యకర్తల హాజరు పార్టీ శక్తిని చూపించే సంకేతంగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఒక రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా లభిస్తుందన్న లెక్కలు వేస్తున్నారు.

ఈ-పేపర్ క్లిప్ చూడండి