Chandrababu: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాల నిర్వహణకు సిద్ధం

swarupa
రచయిత:

ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్ రెడ్డి, మంత్రులు రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో కలిసి చర్చించారు.

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న సర్కార్, వరద ప్రవాహం ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది.

పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాల్లో మొత్తం 373 ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో మోడల్ ఘాట్ ఏర్పాటు చేస్తారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోంస్టేలు ఏర్పాటు చేస్తారు.

ప్రమాదాలు జరగకుండా పటిష్ట కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ విధానం అమలు చేయాలని సూచించారు.

సమీక్షకు ముందు వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు.

ఈ-పేపర్ క్లిప్ చూడండి