Air India Plane Crash: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియాకు భారీ పరిహారం! రూ.1,100కోట్ల బీమా సొమ్ము..!

sirasritha
రచయిత:

అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన భయంకర విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు భారీ బీమా పరిహారం అందినట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదం నేపథ్యంలో పలు బీమా సంస్థలు, రీఇన్సూరర్లు కలిసి ఎయిరిండియాకు రూ.1,100 కోట్లకు పైగా పరిహారం చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది.

గతేడాది జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ విమానం ఒక మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ భవనంపై పడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాదం తీవ్రతకు విమానం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు, రీఇన్సూరర్లు కలిసి మొత్తం 125 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,100 కోట్లకు పైగా) బీమా మొత్తాన్ని ఎయిరిండియాకు చెల్లించినట్లు సమాచారం. అదేవిధంగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సంబంధిత సంస్థలు తెలిపాయి. అయితే ఈ పరిహార ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, తుది మొత్తంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ ఘోర ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగతావారు దుర్మరణం పాలయ్యారు. విమానం హాస్టల్‌పై పడటంతో అక్కడ ఉన్న మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు టాటా గ్రూప్ ఒక ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. గాయపడిన వారి వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజీ భవనాల పునరుద్ధరణ, అలాగే విమాన శకలాల వల్ల పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టాల మరమ్మతుల కోసం ఈ ట్రస్ట్ నిధులను వినియోగిస్తున్నట్లు సమాచారం.

ఈ-పేపర్ క్లిప్ చూడండి