Honda: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్…హోండా నుంచి 10 కొత్త మోడళ్లు రేసులోకి!

swarupa
రచయిత:

దేశీయ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారీ ప్రకటన చేసింది. భారత మార్కెట్ లక్ష్యంగా ఏకంగా 10 కొత్త టూవీలర్ మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఏడు మోడళ్లు పూర్తిగా కొత్తవి కాగా, మూడింటిని అధునాతన అప్‌డేట్స్‌తో తీర్చిదిద్దింది. స్కూటర్లు, రోడ్‌స్టర్, క్రూయిజర్, అడ్వెంచర్ కేటగిరీలలో రానున్న ఈ వాహనాలు పెట్రోల్ (ICE), ఎలక్ట్రిక్ (EV), మరియు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఆప్షన్లలో లభించనున్నాయి. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిని స్థానికంగానే తయారు చేసి, దశలవారీగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఆవిష్కరణలలో అడ్వెంచర్ స్కూటర్ హోండా ADV160 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది 160cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, E85 ఇథనాల్ ఫ్యూయెల్ సపోర్ట్, 8.1 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ మరియు 27 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

రెట్రో రైడింగ్ ప్రియుల కోసం 501cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో హోండా CB500 రోడ్‌స్టర్ రానుంది.

క్రూయిజర్ విభాగంలో 286cc ఇంజిన్‌తో రెబెల్ 300, అలాగే 471cc పారలల్-ట్విన్ ఇంజిన్‌తో శక్తివంతమైన రెబెల్ 500 మోడళ్లు రీ-ఎంట్రీ ఇస్తున్నాయి. ఇవి స్టాండర్డ్, ఇ-క్లచ్ వేరియంట్లలో లభిస్తాయి.

ఆన్-రోడ్, ఆఫ్‌-రోడ్ రైడింగ్ కోసం XR300L (293.5cc) మరియు లాంగ్ డ్రైవ్స్ కోసం XR300 ర్యాలీ బైక్‌లను సిద్ధం చేశారు.

ఎలక్ట్రిక్ విభాగంలో హోండా QC3 ఈవీ స్కూటర్‌ను తీసుకొస్తున్నారు. ఇది 3 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 2 గంటల 40 నిమిషాల్లో 0 నుండి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇందులో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్ కీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు హోండా కొత్తగా ‘ఇ-క్లచ్’ (E-Clutch) టెక్నాలజీని పరిచయం చేస్తోంది. ఈ వ్యవస్థ క్లచ్ లీవర్‌ను నొక్కే అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా గేర్లు మారేలా చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ సమయంలో వాహనం నడపడం అత్యంత సులభతరం అవుతుంది.

ఈ-పేపర్ క్లిప్ చూడండి