తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సరికొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ఆమె తన పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన” అనే పేరును వెల్లడించారు. ఈ పేరు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. శనివారం ఉదయం ఆమె అన్ని మతాల ప్రార్థనలు నిర్వహించి, బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం పది గంటలకు పార్టీ పేరును ప్రకటించి, వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కొత్త పార్టీ పేరు బీఆర్ఎస్కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇదే సమయంలో సభా ప్రాంగణాన్ని తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించారు. వరంగల్ కాకతీయ కళాతోరణం నమూనాలో ప్రధాన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి చిహ్నంగా ఆకర్షణగా నిలిచింది. అలాగే బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.
సంబంధిత వార్తలు
