Budget 2026 : మధ్యతరగతి వారు డబ్బు ఆదా చేస్తారా? సామాన్యులకు బడ్జెట్‌లో ఏముంది?

sirasritha
రచయిత:

కేంద్ర బడ్జెట్ 2026 మిడిల్ క్లాస్ ఆశలను పూర్తిగా తీరుస్తుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జీతాలపై ఆధారపడే ఉద్యోగ వర్గానికి పన్ను తగ్గింపుల రూపంలో ఎలాంటి ప్రత్యక్ష లాభం ఈసారి కనిపించలేదు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో బడ్జెట్‌ను లోతుగా చూస్తే, మిడిల్ క్లాస్‌కు, చిన్న పెట్టుబడిదారులకు కొంత ఊరట కలిగించే అంశాలు మాత్రం ఉన్నాయి.

ఆదాయ పన్ను విషయంలో ఈసారి ప్రభుత్వం ‘పాలసీ కంటిన్యూయిటీ’నే కొనసాగించింది. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు కొనసాగనుంది. దీనికి అదనంగా రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే, రూ.12.75 లక్షల వరకు పన్ను లేకుండా ఆదాయం ఉండే అవకాశం ఉంది. కానీ పన్ను స్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు మాత్రం చేయలేదు.

పన్ను సరళీకరణపై బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ రిమిటెన్స్‌లు, ఓవర్‌సీస్ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (TCS) తగ్గింపు మిడిల్ క్లాస్‌కు ఊరటగా మారనుంది. ఇప్పటివరకు 5% నుంచి 20% వరకు ఉన్న టీసీఎస్‌ను ఓవర్‌సీస్ టూర్ ప్యాకేజీలపై 2%కి తగ్గించారు. అలాగే విద్య, వైద్య అవసరాల కోసం లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ కింద పంపే డబ్బుపై కూడా టీసీఎస్ 2%కే పరిమితం చేశారు.

ఐటీఆర్ ఫైలింగ్‌లో కూడా మార్పులు చేశారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31 వరకు ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైల్ చేయవచ్చు. నాన్-ఆడిట్ వ్యాపారాలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. షేర్ బైబ్యాక్‌లపై డివిడెండ్‌గా కాకుండా క్యాపిటల్ గెయిన్స్‌గా పన్ను వేయాలని నిర్ణయించడం వల్ల చిన్న రిటైల్ ఇన్వెస్టర్లకు కొంత రక్షణ లభించనుంది.

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే వడ్డీ ఆదాయాన్ని ఇకపై పన్ను నుంచి మినహాయించారు. దీనిపై టిడిఎస్ కూడా తొలగించనున్నారు. అలాగే డివిడెండ్లు, వడ్డీ ఆదాయాలపై టిడిఎస్ కోసం ఫామ్ 15G / 15Hను ఒకే విండోలో దాఖలు చేసే సదుపాయం తీసుకురానున్నారు.

మందులు, రోజువారీ ఉత్పత్తులు కూడా కొంత చౌక కానున్నాయి. క్యాన్సర్‌కు సంబంధించిన 17 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. అలాగే అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను వ్యక్తిగతంగా డ్యూటీ ఫ్రీగా దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు. మైక్రోవేవ్ ఓవెన్లు, టీవీలు, లెదర్ గూడ్స్, పాదరక్షల తయారీలో ఉపయోగించే కీలక భాగాలపై కూడా డ్యూటీలు తగ్గించారు.

ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం భారీగా దృష్టి పెట్టింది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను రూ.12 లక్షల కోట్లకు పైగా పెంచారు. రైల్వే, టూరిజం, లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాలకు కేటాయింపులు పెరగడంతో కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే, బడ్జెట్ 2026 మిడిల్ క్లాస్‌కు తక్షణ పన్ను లాభాలు ఇవ్వకపోయినా, ఖర్చులు తగ్గించడం, పెట్టుబడులకు భరోసా, ఉద్యోగాల పెంపు ద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ-పేపర్ క్లిప్ చూడండి