అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ప్రభావంతో బంగారం, వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తూ కేవలం రెండు రోజుల్లోనే రూ.60,000కు పైగా దూసుకెళ్లడం దేశీయ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో బంగారం ధర కూడా భారీగా పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు, మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంవల్ల బంగారం, వెండి ధరలకు బలమైన మద్దతు లభిస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి కమోడిటీ మార్కెట్లో బుల్లిష్ వాతావరణాన్ని సృష్టించాయి.
గురువారం సాయంత్రం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. వెండి ధర ఒక్కరోజులోనే సుమారు రూ.31,000 పెరిగి కిలోకు రూ.4.17 లక్షల స్థాయికి చేరింది. ఇక బంగారం ధర దాదాపు రూ.9,000 పెరిగి రూ.1.75 లక్షలకు చేరగా, ట్రేడింగ్ సమయంలో రూ.1.80 లక్షల మార్క్‌ను కూడా తాకింది.
తాజా గణాంకాలను పరిశీలిస్తే… జనవరి 27న కిలో వెండి ధర రూ.3.56 లక్షలుగా ఉండగా, జనవరి 29 నాటికి అది రూ.4.16 లక్షలకు చేరింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే వెండి ధర రూ.60,000కు పైగా లాభాన్ని చూపింది. అలాగే, జనవరి 27న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.68 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.1.80 లక్షల వరకు పెరిగింది. అంటే దాదాపు రూ.12,000 మేర ఎగబాకింది.
వెండి కిలో రూ.5 లక్షలు దాటుతుందా?
అమెరికా – ఇరాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే, వెండి ధర కిలోకు రూ.5 లక్షల స్థాయిని కూడా చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది సుమారు 20 శాతం పెరుగుదలగా ఉండవచ్చని వారు చెబుతున్నారు. అయితే, ఈ స్థాయిల్లో వెండి కొనుగోలు చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేగంగా పెరిగిన ధరలు అకస్మాత్తుగా భారీ కరెక్షన్కు లోనయ్యే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఆర్థిక సర్వే ప్రకారం సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండే అవకాశముందని, అవసరమైతే మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తోంది. అయితే, 2025లో కనిపిస్తున్న ఈ వేగవంతమైన ర్యాలీ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన కమోడిటీ ధరల అంచనా నివేదిక ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ కమోడిటీ ధరలు సుమారు 7 శాతం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అధిక సరఫరా, ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పెట్టుబడిదారులు బంగారం, వెండిలో కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారు లాభాలను బుక్ చేసుకోవడంపై ఆలోచించవచ్చని, కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే వారు ధరలు స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.
