బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది.
ముఖ్యాంశాలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ (GDP) 6.8-7.2 శాతంగా ఉండొచ్చు. గతేడాదితో పోలిస్తే అంచనాలను పెంచింది. 2025-2026కు జీడీపీ అంచనాలను 7.4 శాతం నుంచి తగ్గించింది. ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి రేటు నమోదుకావొచ్చని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ (MoSPI) అంచనా వేసిన సంగతి తెలిసిందే.
2024-2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అది 4.4 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది.
అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, 2026-2027కు భారత్‌లో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.
ఇటీవల భారత్-ఈయూ (EU) మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించింది.
వికసిత్ భారత్‌ను సాధించడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది.
దేశీయంగా తయారీ, ఎగుమతులు ఎలక్ట్రానిక్ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇందులో మొబైల్ తయారీ కీలకం. పదేళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగి, రూ.18 వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు చేరింది.
డిజిటల్ సేవల విషయంలో గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గుతోంది.
